5 June, 2026 | 1:08 AM

హత్యాకాండ!

05-06-2026 12:15 AM
  1. కాసుల కక్కుర్తికి కాటేస్తున్నారు!
  2. చేవెళ్ళ పరిధిలో ఏడాదిన్నరలో 8 మంది మహిళల హత్య
  3. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధాలే మూలకారణం
  4. సాంకేతిక ఆధారాలతో గుట్టు రట్టు చేస్తున్న పోలీసులు

చేవెళ్ల, జూన్ 4 (విజయక్రాంతి): చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్, షాబాద్, మొకిలా, శంకర్ పల్లి ప్రాంతాల్లో గడిచిన ఏడాదిన్నర కాలంలో ఏకంగా ఎనిమిది మంది మహిళలు దారుణ హత్యలకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒంటరితనం, అక్రమ సంబంధాలు, సహజీవనం, విచ్చలవిడి మద్యపానం మరి యు ఆర్థిక లావాదేవీలే ఈ ఘోరాలకు ప్ర ధాన కారణాలుగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో లభ్యమవుతున్న కుళ్ళిన శవాలు, అస్తిపంజరాలు హడలెత్తిస్తున్నాయి.

అప్పు తీర్చమంటే.. హతమార్చి భూమిలో పాతేశారు..

మొయినాబాద్ మండలం తోల్కట్ట రెవి న్యూ పరిధిలో మే నెలలో వెలుగుచూసిన జంట హత్యల ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. తాండూరుకు చెందిన ఓ మ హిళ ఇచ్చిన అప్పు తిరిగి అడగడంతో, నిందితులు పక్కా స్కెచ్ వేశారు. ‘మా సార్ వద్ద డబ్బులు ఇప్పిస్తాం‘ అని నమ్మబలికి ఇద్దరు మహిళలను ఒక ఫామ్హౌస్కు పిలిపించి, నోళ్ల లో గుడ్డలు కుక్కి కిరాతకంగా చంపేసి ప్రభు త్వ భూమిలో పాతిపెట్టారు. ప్రధాన నిందితురాలు మరో 15 మంది మహిళలను సై తం ఇదే తరహాలో హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

సావు తెచ్చిన సహజీవనం.. నగల కోసం నరరూప రాక్షసులు..

కుటుంబ వివాదాలతో విడిపోయి, ఒంటరిగా ఉంటున్న మహిళలే నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ముక్కు మొహం తెలియని వారిని నమ్మి ’సహాజీవనం’ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కందవాడ రెవిన్యూలో ఓ మహిళ శవం చెట్టుకు వేలాడుతూ కుళ్ళిన స్థితిలో లభించడమే ఇందుకు నిదర్శనం.

మరికొన్ని చోట్ల మహిళల మెడలోని ఆభరణాలు, కాళ్ల గజ్జెల కోసం చీలమండల వరకు కాళ్లు నరికి, కంఠం కోసి నగలు దోచుకెళ్తున్న కిరాతక ముఠాల ఉనికి మిడిల్ క్లాస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఒంటిపై బంగారం వేసుకోవాలంటేనే మహిళలు జంకుతున్నారు.

సాంకేతికతతో గుట్టు రట్టు..

బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సిసిటివి  ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వరుస హత్యల మిస్టరీని ఛేదిస్తున్నారు. నిందితులను పట్టుకుని శవాలను వెలికితీయిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి 

‘ఒంటరి మహిళలు అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా చట్టపరమైన పద్ధతులు పాటించాలి. అప్పు ఇచ్చిన వారు బాకీ తీరుస్తామని నిర్జన ప్రదేశాలకు పిలిస్తే గుడ్డిగా నమ్మి వెళ్లకూడదు. నేరస్థులు ఎక్కువగా మద్యం మత్తులోనే ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. ప్రజలు నిరంతరం అలర్ట్గా ఉండాలి.‘

 కిషన్, చేవెళ్ల ఏసీపీ