8 August, 2026 | 1:13 AM

రైస్‌మిల్లర్ భారీ సీఎంఆర్ కుంభకోణం..!

08-08-2026 12:04 AM

ప్రభుత్వానికి రూ.14.82 కోట్ల నష్టం.. మిల్లు యాజమానిపై కేసు నమోదు

పరారీలో యాజమాన్యం.. గాలింపు చేపట్టిన పెబ్బేరు పోలీసులు

పెబ్బేరు, ఆగస్టు 7 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం విలువైన రూ.14,82,76,644 బకాయిలు చెల్లించకుండా ఎగవేసినట్లు అధికారులు గుర్తించడంతో సంబంధిత రైస్మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే యాజమాన్యం పరారైనట్లు సమాచారం. వారి కోసం పెబ్బేరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి

పెబ్బేరు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న సాయి గోపాల్ ఇండోటెక్ రైస్ మిల్లులో 202223 రబీ సీజన్కు సంబంధించి 4,806 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం నిల్వ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూ.14.82 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అందజేయలేదని అధికారులు పేర్కొన్నారు. జూలై 27న హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జిల్లా సివిల్ సప్లై శాఖ సంయుక్తంగా మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులో కేవలం 780 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉండగా, మిగిలిన సుమారు 4,021 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అనంతరం పూర్తి నివేదికను జిల్లా సివిల్ సప్లై శాఖకు అందజేశారు.

ఫిర్యాదు.. కేసు నమోదు 

జిల్లా సివిల్ సప్లై డీఎం ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు రైస్మిల్లు, వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అక్రమాల కోసమే కొత్త మిల్లులా..? 

జిల్లాలో కొంతమంది వ్యాపారులు సీఎంఆర్ ధాన్యం కేటాయింపులను లక్ష్యంగా చేసుకుని కొత్త రైస్మిల్లులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో ప్రభుత్వ ధాన్యం తీసుకుని, బియ్యం సరఫరా చేయకుండా కోట్ల రూపాయలు ఎగవేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నుంచి మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో మిల్లు ఏర్పాటు చేసినా, సీఎంఆర్ ధాన్యం విలువ మాత్రం దానికి పలుమార్లు ఎక్కువగా ఉండటంతో కొందరు ఈ మార్గాన్ని అక్రమ సంపాదనకు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లులను సీజ్ చేసినా, తరలించిన ధాన్యం విలువ మిల్లు విలువ కంటే అధికంగా ఉండటంతో యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.

 నిబంధనలు అమలవుతున్నాయా..? 

ప్రతి సీజన్లో సీఎంఆర్ ధాన్యం కేటాయింపుకు ముందు రైస్మిల్లుల నుంచి 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలనే నిబంధన ఉంది. అయితే అన్ని మిల్లుల విషయంలో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన కొన్ని మిల్లులకు కూడా భారీ మొత్తంలో ధాన్యం కేటాయించడం వెనుక కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ 

ఇటీవల జిల్లాలో వరుసగా సీఎంఆర్ అక్రమాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన మిల్లు యాజమాన్యంతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. గత నాలుగేళ్లలో సీఎంఆర్ కేటాయింపులు, ధాన్యం సరఫరా, బ్యాంకు గ్యారెంటీలు, తనిఖీల వివరాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.