calender_icon.png 9 December, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీగూడెం బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్‌లో భారీ పేలుడు

09-12-2025 07:23:43 PM

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పరిశ్రమను తక్షణమే మూసివేయాలి

చివ్వెంల తహసీల్దార్‌కు రాష్ట్ర నాయకుడు భాషిపంగు సునీల్ వినతి పత్రం

చివ్వెంల (విజయక్రాంతి): సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి పక్కన బీబీగూడెం సమీపంలో పనిచేస్తున్న బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించడం స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. పరిశ్రమలోని ఫోమ్ ట్యాంక్ ఒక్కసారిగా ఘోర శబ్దంతో పేలిపోవడంతో, పేలిన ఇనుప, మెటల్ భాగాలు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరి పడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో శకలాలు దూరం దూరం వరకు పడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర నాయకులు భాషిపంగు సునీల్, సంఘం చివ్వేంల మండల అధ్యక్షులు చెరుకు నగేష్ తో కలిసి ఈరోజు చివ్వెంల తహసీల్దార్ ని కలిసి పరిశ్రమపై తక్షణ విచారణ జరిపి, వెంటనే మూసివేయాలన్న డిమాండ్‌తో వినతి పత్రం సమర్పించారు.

 తహసీల్దార్ సునీల్ కి సమర్పించిన వినతి పత్రంలో ముఖ్యాంశాలు:

అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా?

ఈ పరిశ్రమ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని పారిశ్రామిక అనుమతులు కలిగి ఉందా?

పారిశ్రామిక భద్రతా నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారా?

లేక అనుమతులు లేకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ నడుపుతున్నారా?

పరిశ్రమ వల్ల కార్మికుల, స్థానిక నివాసుల, రహదారి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదమా?

ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి విచారణ అవసరం అని సునీల్ పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలకు భయంకర ముప్పు

ప్రపంచీకరణ పేరుతో పరిశ్రమలు పెరుగుతున్నా, ప్రజల భద్రతను విస్మరించే యాజమాన్యం చర్యలపై యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివాస ప్రాంతాల దగ్గరే ఇలాంటి ప్రమాదకర పరిశ్రమ కొనసాగడం వల్ల.. పరిశ్రమలో పని చేసే కార్మికులు, బీబీగూడెం ప్రాంత ప్రజలు, ప్రతిరోజూ రద్దీగా ఉండే సూర్యాపేట–ఖమ్మం రహదారి ప్రయాణికులు, అందరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రజల భద్రత కోసం ఈ పరిశ్రమను వెంటనే మూసివేయాలి”.. సునీల్ డిమాండ్

బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ పరిశ్రమ నిర్లక్ష్యం వలన నేడు పెద్ద ప్రమాదం తప్పింది మాత్రమే తప్ప, భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరగొచ్చో చెప్పలేమని, అందువల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిశ్రమను తక్షణమే మూసివేయాలని భాషిపంగు సునీల్, చెరుకు నగేష్ తహసీల్దార్ కి విజ్ఞప్తి చేశారు.