23 April, 2026 | 3:35 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంతో భారీ ఆర్థిక నష్టం

23-04-2026 01:44 AM

అక్రమాలు బయటపడతాయని బిఆర్‌ఎస్ కోర్ట్ ని ఆశ్రయించింది

కాలేశ్వరం ప్రాజెక్టు టిఆర్‌ఎస్ కు ఏటీఎంలా మారిందని ప్రధాని, అమిత్ షాలే అన్నారు

కట్టంగూర్ ఏప్రిల్ 22: కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంతో భారీ ఆర్థిక నష్టం జరిగిందని ప్రభుత్వ విఫ్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు బుధవారం నకరికల్ లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుబడుతూనే ఉందన్నారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది అని, కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్లుగా గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు సూచించిందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాణ్యత లోపాలు, నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగిందన్నారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొన్నారు. బాధ్యత వహించాల్సింది వారే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం అంటే అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

అవినీతికి ఎవరు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ నేతలు ఏటీఎంలా ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారన్నారు. ఆ మాట వాస్తవమా కాదా అనేది ప్రజలే గమనించాలన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి దోచుకుని దాచుకున్న బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడడం సమంజసంగా లేదన్నారు.

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ పార్టీ నాయకునికి గుణపాఠంగా నిలవాల్సి ఉండగా, ఆయనకు ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదని జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కమిషన్ల కోసం, స్వప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రజల సొమ్మును దోచుకున్నారనేది తన విమర్శ మాత్రమే కాదని, ఇది ప్రజల్లో బలంగా ఉన్న అభిప్రాయమన్నారు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు మా ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.