23 April, 2026 | 3:25 AM

నాణ్యతే ‘లక్ష్యం’.. ప్రగతే ‘పథం’

23-04-2026 01:43 AM
  1. రూ. 6.50 కోట్లతో బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన
  2. వర్షాకాలం లోపే నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  3. ఏదులాపురం మున్సిపాలిటీకి రూ. 16.70 కోట్లతో అభివృద్ధి పనులు
  4. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

ఖమ్మం, ఏప్రిల్ 22(విజయ క్రాంతి): ప్రభుత్వ పనుల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, నాణ్యతతో కూడిన రహదారులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార  శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు రూ. 6.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

గడువులోగా పనులు పూర్తి కావాలి

శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ లోపే రహదారి పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్థానిక ప్రజాప్రతినిధులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గతంలోనే ముత్తగూడెం అభివృద్ధి కోసం రూ. 16.70 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే మున్సిపాలిటీ వ్యాప్తంగా మరిన్ని సీసీ రోడ్లు, డ్రైన్ల పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని, త్వరలోనే రెండో విడత పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ అనిత, ప్రత్యేక అధికారి రమేష్, ఆర్&బి ఎస్‌ఈ యాకోబు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.