18 May, 2026 | 3:29 AM

భోలక్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

18-05-2026 12:00 AM

భయంతో పరుగులు తీసిన జనం

రూ. 20 లక్షల ఆస్తి నష్టం

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): భోలక్‌పూర్‌లోని ఇందిరానగర్‌లో గల కట్టెల స్క్రాప్ గోదాములో ఆదివారం తెల్లవారు జాము 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక బస్తీ వాసులు తీవ్ర భయాందోళనకు గురై బయటికి పరుగులు తీసి పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందజేశారు. 10 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో మళ్లీ గోదాం నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు అగ్ని మాపక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫైర్ ఇంజన్‌ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా ఉన్న మహాత్మానగర్ వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అగ్నిప్రమాదం వల్ల స్థానికంగా ఉన్న ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గోడలు బీటలు వారగా, గృహోపకరాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని వారు బయటికి పరుగులు తీశారు. 

ఇంటి నుంచి బయటకు రాలేని అరుణమ్మ అనే వృద్ధురాలిని స్థానికులు రక్షించారు. శనివారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో టపాసులు పేల్చారు. వాటినిప్పురవ్వలు గోదాంలో పడడంతోనే తెల్లవారుజామున మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. కాగా అగ్నిప్రమాదం వల్ల సెంట్రింగ్ చెక్కలు, ప్యాకింగ్ కర్రలు, స్క్రాప్ సామాన్లు కాలిబూడిదయ్యాయని యజమాని నిజాం ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. బాధితుడితో మాట్లాడారు. నష్టపరిహారం విషయాన్ని కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.