22 April, 2026 | 2:35 AM

250 కోట్ల భారీ మోసం

22-04-2026 01:29 AM
  1. రైతుల నష్టపరిహారం కాజేసిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ 
  2. కుషాయిగూడలో నాగర్‌కర్నూల్ జిల్లా రైతుల ఆందోళన

కుషాయిగూడ, ఏప్రిల్ 21: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతుల ఆవేదన ఆగ్రహంగా మారిం ది. తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం డబ్బులను ప్రైవేట్ ఫైనాన్స్ పేరిట మోసంచేశారంటూ మంగళవారం వారు కుషాయిగూడలో పెద్దఎత్తున ధర్నాకు దిగారు. బాధిత రైతుల కథనం ప్రకారం, ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఒక పథకం ప్రకారం తమను మోసగించారని వారు తెలిపారు.

నష్టపరిహారం ద్వారా వచ్చిన డబ్బులతో, తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని.. పెట్టుబడులపై నెలకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు 25 గ్రామాలకు చెందిన 2,500 నుంచి 3,000 మంది రైతుల నుంచి విడతల వారీగా నిందితులు డబ్బులు సేకరించారు. కొందరికి మొద ట్లో కొంత వడ్డీ చెల్లించి నమ్మకం పెంచి, ఆ తర్వాత భారీ మొత్తాలు తీసుకుని మాయమయ్యారని వారు ఆరోపించా రు. ఇలా మోసపోయిన మొత్తం డబ్బు సుమారు రూ. 250 కోట్లకు పైగా ఉం టుందని రైతులు ఆవేదనతో చెప్పారు. 

 కాప్రా సర్కిల్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న ప్రధాన నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు రైతులు బైఠాయించి గంటల తరబడి నిరసన కొనసాగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. చాలామంది రైతులు తమ కుటుంబ అవసరాల కోసం చేసుకున్న పొదుపులతో పాటు, అప్పులు తెచ్చి కూడా ఈ ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు డబ్బులు పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

కొందరు రైతులు ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇట్యాల సాయిబాబా, ధనుంజయ్ గుప్తా, బాలీశ్వర్, తుకారాం, నాగం కరుణాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, జానకిరామ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రధాన నిందితులు ఇంకా అరెస్ట్ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా సందర్భంగా మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. భూములు పోయాయి, డబ్బులు కూడా పోయాయి.. ఇప్పుడు మా కుటుంబాలు ఎలా బతుకుతాయి? అంటూ వారు వాపోయారు. కొందరు రైతులు తమ పిల్లల చదువులు ఆగిపోయాయని, అప్పుల బాధతో ఇళ్లలో కలహాలు పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు పాశం యాదగిరి మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులకు సరైన మార్గదర్శకం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

పునరావాస ప్యాకేజీల అమలు లోపించడంతో రైతులు ప్రైవేట్ సంస్థల వలలో పడాల్సి వచ్చిందన్నారు. వెంటనే నిందితులందరినీ అరెస్ట్ చేసి, వారి ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మధ్యవర్తిత్వం చేసి రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన తర్వాత కొంతమంది రైతులు వెనుదిరిగినా.. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టంచేశారు.