calender_icon.png 12 February, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు భారీ ర్యాలీ

12-02-2026 05:29:16 PM

– అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో

మునుగోడు,(విజయక్రాంతి): కార్మికులకు మరణ శాసనంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2025లో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలు ప్రజావ్యతిరేకమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కర్షకులపై దుష్ప్రభావం చూపే చట్టాలు తీసుకువస్తోందని విమర్శించారు. ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే సాధారణ ప్రజలకు జీవనోపాధి కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ధనిక వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వామపక్ష కార్మిక సంఘాలు ఐక్యతతో పోరాటం కొనసాగించాలని అన్నారు.