బూర్గంపాడు మండలంలో ఘనంగా మేడే
బూర్గంపాడు, మే1 (విజయక్రాంతి): ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బూర్గంపాడు మండలంలో సీపీఎం పార్టీ మరియు సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు శుక్రవారం బూర్గంపాడు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఎర్రజెండాలను ఆవిష్కరించి కార్మిక లోకానికి సంఘీభావం ప్రకటించారు.
ఈ వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పాల్గొని ప్రసంగించారు. 140 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం, చేసిన పోరాటాల ఫలితంగానే నేడు 8 గంటల పని దినం సాధ్యమైందని గుర్తు చేశారు. కానీ నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికులను యజమానులకు బానిసలుగా మారుస్తున్నారని, పని భారాన్ని 12 గంటల వరకు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండలంలోని సారపాక, సుందరయ్య నగర్, బూర్గంపాడు, సోంపల్లి, బంజర, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాల్లో పార్టీ జెండాలను ఘనంగా ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, హక్కుల రక్షణ కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిదా, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం, కనకం వెంకటేశ్వర్లు, గుంటుక కృష్ణ, బోళ్ల శ్రీశైలం, నిమ్మల అప్పారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






