calender_icon.png 26 July, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా దరఖాస్తు గడువు పొడిగింపు

26-07-2025 12:50:34 AM

  1.    30 వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ 
  2. విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) శుక్రవారం నోటిఫికేష్ జారీ చేసింది. 2025--26 అకాడమిక్ ఏడాదికి గాను అర్హత పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.

అభ్యర్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన పలు విజ్ఞప్తులతో పాటు స్థానిక/స్థానికేతర సమస్యకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా దరఖాస్తు గడువును పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. గతంలో ఈనెల 15న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ పొడిగింపు జరిగిందని పేర్కొన్నారు.

నీట్ యూజీ--2025 కటాఫ్ స్కోర్లు:

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నీట్ యూజీ--2025లో కింది కటాఫ్ స్కోర్లు సాధించి ఉండాలని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ వెల్లడించింది. జనరల్ కేటగిరీ (ఈడబ్ల్యూఎస్‌తో సహా) 50వ పర్సంటైల్, 144 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40వ పర్సంటైల్, 113 మార్కులు, ఓసీ కేటగిరీకి చెందిన దివ్యాంగులు 45 పర్సంటైల్, 127 మార్కులు సాధించి ఉండాలి.

అభ్యర్థులు <https://tsmedadm. tsche.in> వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తు సమర్పణలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 9059672216, 7842136688 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.