26-07-2025 01:35:30 PM
మంచిర్యాల, (విజయక్రాంతి): బొగ్గు పరిశ్రమ పరిరక్షణ, కార్మిక హక్కుల సంరక్షణ లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలలో సింగరేణి కార్మికులు భాగస్వామ్యం కావాలని బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) ద్వార సమావేశంలో ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణితో కలిసి మాట్లాడారు. సింగరేణిలో గతంలో 1.3 లక్షల ఉద్యోగులతో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం 39 వేల ఉద్యోగులతో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, కోల్ ఇండియాలో 6.5 లక్షల ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగులతో 800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఉత్పత్తిలో పెరుగుదల గణనీయంగా పెరిగిందని, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, తక్కువ వేతనం, భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను వినియోగిస్తున్నారని, వారికి కనీస వేతనాలు (హెచ్ పి సి), సురక్షిత పని వాతావరణం, వైద్య సదుపాయాలు, నివాస క్వార్టర్లు లేవన్నారు.
12 ఏండ్లులుగా సవరణ లేదు...
రాష్ట్రంలో 12 సంవత్సరాలుగా కనీస వేతన సవరణ జరగలేదని బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదని, వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా పెరిగిందని, సంస్థలు పరిపాలన విభాగం గాడి తప్పిందని, ఇప్పటికైనా రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని సూచించారు.
ట్రాన్స్కో, జెన్కోల నుంచి బకాయిలు
ట్రాన్స్కో, జెన్కోల బకాయలు గత ప్రభుత్వ హయాంలో రూ. 26 వేల కోట్లు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ మొత్తం రూ. 39,661.57 కోట్లకి పెరిగిందని, ఇప్పటికైనా విద్యుత్ బొగ్గు బకాయలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. బొగ్గు బకాయిలు రూ. 14,743.25 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 24,918.32 కోట్లు చెల్లింపులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు:
1. పర్మనెంట్ కార్మికుల సంఖ్య పెంచి కనీసం 50 శాతం ఉత్పత్తినీ శాశ్వత ఉద్యోగులతో తీయాలి.
2. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, సీఎంపిఎఫ్ ఖాతాలు, వైద్యం, క్వార్టర్లు కల్పించాలి.
3. బొగ్గు సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి.
4. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసి పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలి.
5. తెలంగాణ ప్రభుత్వం రూ. 39,661.57 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి.
6. చట్టబద్ధ బొగ్గు గనుల సేఫ్టీ, భద్రతా చర్యలు అమలు చేయాలి.
7. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
8. సింగరేణి, కోల్ ఇండియాలలో యూనియన్ వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలి.
9. అపెక్స్, జెసిసి, వెల్ఫేర్, సేఫ్టీ కమిటీల సమావేశాలు జరగాలి.
10. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలి.
తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు జాతీయ ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్, సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, ట్రెజరర్ గూడ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి, కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్, ఆర్కే 5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్, టి కిరణ్ కుమార్, కుంట రాజు, పాగిడి శ్రీకాంత్, చల్ల ప్రశాంత్, బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.