calender_icon.png 9 January, 2026 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలించిన మెదక్ కలెక్టర్ ఆలోచన

05-01-2026 12:21:21 AM

విద్యార్థులకు బ్లాంకెట్లు అందించిన కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట/ నార్సింగి(చేగుంట), జనవరి 4 : మెదక్ జల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచనతో చలికాలంలో వణుకుతున్న హాస్టల్ విద్యార్థులకు బ్లాంకెట్లు అందించడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసే అధికారులు, ప్రజాప్రతినిధులకు బోకెలు, శాలువాలు కాకుండా  బ్లాంకెట్లను అందించాలని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా అధికారులు, వారి సిబ్బంది ప్రజా ప్రతినిధులు స్పందించి బ్లాంకెట్లను అందించారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ బ్లాంకెట్లను రామాయంపేట మండలం డి.ధర్మారం బీసీ హాస్టల్లో 55 బ్లాంకెట్స్ ను పంపిణీ చేశారు. అలాగే నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో 65 బ్లాంకెట్లను పంపిణీ చేశారు.

ముందుగా హాస్టళ్ళలోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, మెనూ,  నిత్యవసర వస్తువుల స్టోర్ రూమ్ , పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేసి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తూ నిరుపేద విద్యార్థులకు  గుణాత్మక విద్య అందిస్తుందన్నారు. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యాబోధన జరుగుతుందని చెప్పారు.

జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో ముచ్చటించగా హాస్టల్లో వసతులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చలికాలం ఈ దుప్పట్లు, రగ్గులు మాకు ఎంతో చలి నుండి రక్షణ కల్పిస్తాయని వీటిని జాగ్రత్తగా భద్రపరచుకుని ఉపయోగించుకుంటామని విద్యార్థులు కలెక్టర్కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల హాస్టల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.