28 March, 2026 | 6:24 AM

సినిమా రిబ్బన్లు కాదు.. లైబ్రరీ మెట్ల వద్దకు రా..

09-01-2026 01:20 PM

సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్!

నంగునూరు,విజయక్రాంతి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నిప్పులు చెరిగారు. వేల మంది పోలీసుల పహారా మధ్య సినిమా థియేటర్ల ప్రారంభోత్సవానికి వెళ్తున్న సీఎంకు.. పక్కనే ఉన్న నిరుద్యోగుల అడ్డా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్నికల ముందు రాహుల్ గాంధీతో కలిసి లైబ్రరీ మెట్లపై కూర్చుని.. ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన మాట ఏమైందని నిలదీశారు.

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను(Congress Job Calendar) కాస్తా 'జాబ్ లెస్' క్యాలెండర్‌గా మార్చేసిందని ధ్వజమెత్తారు. హక్కుల కోసం రోడ్డెక్కిన దిల్సుఖ్‌నగర్ విద్యార్థుల వీపులు పగలగొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు."సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే.. సినిమా థియేటర్ దగ్గర కాదు, పక్కనే ఉన్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. నిరుద్యోగ భృతి, స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.