కాంగ్రెస్‌తోనే మెదక్ అభివృద్ధి
ఇందిరాగాంధీ హయాంలోనే అనేక ఫ్యాక్టరీలు ఏర్పాటు
నేడు రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయండి
ఏర్పాట్ల పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
నర్సాపూర్, మే 8: బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రజలను హింసించి కేసులు పెట్టి కోట్ల రూపాయలను సంపాదించుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపిం చారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. రాహుల్‌గాంధీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. మెదక్ పార్లమెంట్ ఇందిరా గాంధీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలు వచ్చాయని చెప్పారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రఘునందన్‌రావు ఈ నియోజకవర్గానికి రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఇక్కడి ప్రజలను హింసించి, కేసులు పెట్టి భూములు లాక్కొని కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు, ఉచిత కరెంటు పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.




