జీరో యాక్సిడెంట్ జోన్‌గా మెదక్ జిల్లా తయారు కావాలి..
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 16(విజయ క్రాంతి) : జీరో యాక్సిడెంట్ జోన్ గా మెదక్ జిల్లాను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో అరైవు-అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవింగ్ చేసేవారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం పై పోలీస్-రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలోఅవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలోనే హార్ట్ ఎటాక్ గురైన వారికి సిపిఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చు అనే నినాదంతో సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ప్రత్యక్షంగా విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జీరో యాక్సిడెంట్ జోన్ గా తీర్చిదిద్దాలని అన్నారు. పోలీస్ రవాణా శాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జరిగే ప్రాణం నష్టాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా వివరించడం జరిగిందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అందరం కృషిచేద్దామని అన్నారు. ఈ నేపథ్యంలో, రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే రోడ్డు ప్రమాదాలపై మనకు కనువిప్పు కలగాలన్నారు.
హెల్మెట్ సీడ్ బెల్ట్ మన ప్రాణాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయన్నారు. చిన్న నిర్లక్ష్యం వలనే ప్రమాదాలు అధికంగా జరుగుతాయన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, అధికారులు, సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






