- మూడుకు తగ్గిన రూరల్ మండలాలు
- మిగిలిన జీపీలు 33
- అన్నింటిని మున్సిపల్‌లో విలీనం చేసే యోచనలో సర్కార్
మేడ్చల్, సెప్టెంబర్ 12: మేడ్చల్ జిల్లా, మండల పరిషత్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేవలం 33 గ్రామ పంచాయ తీలే మిగిలాయి. మూడు మండలాల్లోని 33 పంచాయతీలతో జిల్లా పరిషత్ కొనసాగ డం సాధ్యం కాదు. జిల్లా పరిషత్ కొనసాగాలంటే కనీసం ఐదు జెడ్పీటీసీలు ఉండాలి. మొన్నటి వరకు మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 15 మండలాలు ఉన్నాయి.
ఇందులో 10 అర్బన్ మండలాలు కాగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్ర మే ఐదు రూరల్ మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీలలో జీపీల విలీనంతో ఘట్‌కేసర్, కీసర అర్బన్ మండలాల య్యాయి. మేడ్చల్ మండలంలో 13, శామీర్‌పేట్ మండలంలో 7, మూడుచింతలపల్లి మండలంలో 13 జీపీలు మిగిలా యి. ఈ గ్రామాల వారు ఇతర జిల్లాల్లో కలిసేందుకు సిద్ధంగా లేరు. రాజకీయం గా, భౌగోళికంగానూ అనుకూలంగా లేదు.
జిల్లా విస్తరణకు బ్రేక్..
మేడ్చల్ జిల్లాను విస్తరించాలని మొదట అధికారులు ప్రతిపాదించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, మనోహరాబాద్ మండలాలను, యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం, బీబీనగర్ మండలాలను మేడ్చల్ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల కేసీఆర్ సెగ్మెంట్ మూడు ముక్కలవుతుంది.
గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాలు సిద్దిపేట జిల్లాలో, తూప్రాన్ మండలం మెదక్ జిల్లాలో, ములుగు, మనోహరాబాద్ మండలాలు మేడ్చల్ జిల్లాలో ఉంటాయి. ఇలా చేయడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా రాజకీయ ఇబ్బందులు కూడా ఎదురవుతాయని భావించి ఈ ప్రతిపాదనకు బ్రేక్ వేసినట్లు తెలిసింది.
కొత్తగా ఐదు మున్సిపాలిటీలు..
ఇతర జిల్లాల మండలాలు మేడ్చల్ జిల్లాలో కలిపినా, ఇక్కడి మండలాలు ఇతర జిల్లాలో కలిపినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమున్నందున 33 జీపీలతో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు వరకు మున్సిపాలిటీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మేడ్చల్ మండలంలో 13 జీపీలు ఉన్నందున డబీల్ పూర్, రావల్‌కోల్, శామీర్‌పేట్ మండలంలో 7 గ్రామాలున్నందున అలియాబాద్, తుర్కపల్లి గ్రామాలను, 13 గ్రామాలతో మూడుచింతలపల్లి మున్సిపాలిటీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి గ్రామాలన్నీ విలీనం చేస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ జిల్లాగా మారుతుంది. అర్బన్ జిల్లాగా మారితే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ఉండవు. పంచాయతీరాజ్, డీపీవో, డీఆర్‌డీవో కార్యాలయాలు కూడా ఉండవు.