గోపాలరావుపల్లె గుట్టల్లో పులి సంచారం
భయాందోళనలో గ్రామస్తులు, అప్రమత్తంగా
ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లె అటవీ ప్రాంతంలో పులి సంచారం(Tiger roaming) కలకలం రేపుతోంది. చింతల్ తాన మానేరు ఆనుకుని ఉన్న గుట్ట ప్రాంతంలోని మామిడి తోటలో పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోపాలరావుపల్లె గుట్ట వైపు కూడా పులి అడుగుల జాడలు ఉన్నట్లు సమాచారం అందింది. పులి జాడ కోసం అధికారులు ప్రత్యేక బృందాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. మానేరు సమీప ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.






