6 May, 2026 | 5:22 PM

ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు

10-12-2024 04:47 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధి టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ పిల్లలను పరీక్షించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి చికిత్సను అందించారు. ఈ సందర్భంగా పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం వల్ల ఉపయోగాలు, ఈ చలికాలంలో వచ్చే వ్యాధులైన జలుబు ఫ్లూ దగ్గు సైనసైటిస్ బ్రాంకైటిస్ ఆస్తమా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. వంటశాలను పరిశీలించి కూరగాయలను 15 నిమిషాలు ఉప్పునీటిలో నానబెట్టి పరిశుభ్రంగా కడిగిన తర్వాతనే ఉపయోగించమని, పరిశుభ్రత నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే వడ్డించమని వంట వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమర్ సింగ్, వార్డెన్ నాగేశ్వరరావు, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, ఏఎన్ఎంలు రమా కుమారి, వెంకటరమణ, స్టాఫ్ నర్స్ సునీత తదితరులు పాల్గొన్నారు.