4 June, 2026 | 5:17 PM

కల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల సంరక్షణకు ఆధునిక పరికరాల ఏర్పాటు

04-06-2026 04:21 PM

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూకు 9 లక్షల విలువైన వైద్య పరికరాలు అందజేత

కల్లా ఫౌండేషన్ ను అభినందించిన కలెక్టర్

ఖమ్మం టౌన్  (విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం సేవా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ప్రశంసించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కల్లా  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)లో ఏర్పాటు చేసిన 9 లక్షల విలువైన వివిధ ఆధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సమాజ శ్రేయస్సు కోసం సేవా దృక్పథంతో ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ప్రజలకు ఉపయోగ పడే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను అందించడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి, వైద్య సేవల విస్తరణకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని కలెక్టర్ తెలిపారు. సమాజంలో అవసరమైన రంగాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరింత మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

కల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకారం కొనసాగించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.ఎం. నరేందర్, కల్లా ఫౌండేషన్ చైర్మన్ పాపారావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వల్లభనేని రామారావు, ప్రతినిధులు పసుమర్తి రంగా రావు, సాంబశివ రావు, మేళ్ళచెరువు వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సంతోష్, బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్ది, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.