14-10-2025 02:14:15 PM
హైదరాబాద్: తర్వలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ వెంగళరావు నగర్ కాంగ్రెస్ పోలింగ్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం పని చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మీనాక్షి నటరాజన్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నిన్న 10 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 21 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో నామినేషన్ల స్వీకరిస్తామని, కార్యాలయంలో నేరుగా లేదా.. డిజిటల్ విధానంలో దాఖలు చేసుకోవచ్చాని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ తరుపున బరిలో దిగిన నవీన్ యాదవ్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై వివర్శలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దివంగత మాగంటి గోపినాధ్ ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలు, బీఆర్ఎస్ తీసుకొచ్చిన పథకాల గురించి నియోజకవర్గ ప్రజలకు వివరిస్తున్నారు.
అయితే, మాగంటి సునీత స్టేజిలపై కన్నీరు పెట్టడడంపై కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసమే సునీత ఏడుస్తున్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన సభలో భర్త గోపినాథ్ ను తలుచుకొని మాగంటి సునీత కంటతడి పెట్టుకున్నారు. బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముగ్గరి పేర్లను ఫైనల్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధిష్ఠానానికి పంపించారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిలో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డా. పద్మజ పేర్లు ఉన్నాయి. అయితే ఢిల్లీ పెద్దలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో బీసీ నేత అయితే బాగుంటుందని సూచించింది. దీంతో అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది.