ప్రతి నెలా రూ.10 కోట్లు
- రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించేందుకు హామీ
- ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల సమావేశం
- పలు అంశాలపై చర్చ, కొన్నింటికి అంగీకారం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలను ప్రతి నెలా రూ.10 కోట్ల చొప్పున చెల్లిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి నెలా కనీసం రూ.100 కోట్లు చెల్లించాలని జేఏసీ నేతలు కోరగా.. దశలవారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో సంస్థ ఈడీ అధికారులు సమావేశం అయ్యారు. డిమాండ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఉద్యోగ విరమణ పొంది ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ల, అధికారులను తొలగించి వారి స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే 2019 సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై నమోదైన పోలీసులు కేసులను ఎత్తి వేయడానికి ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం లేఖ పంపిందన్నారు.
ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే వారిదే బాధ్యత అని, కండక్టర్లు, డ్రైవర్లకు కేసులు రాయకూడదని జేఏసీ నేతలు కోరగా.. దీనిపై కమిటీ వేస్తామని, కార్మిక సంఘాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 30 శాతం వరకు ఎలాంటి రిపోర్ట్ రాయరని, రెండవ సారి టెస్ట్‌కు అనుమతిస్తారని జేఏసీ నేతలు పేర్కొనగా.. పాత మిషన్లను మార్చి కొత్తవి కొనుగోలు చేయటానికి అంగీకరించారు.
బ్రెడ్ విన్నర్ స్కీం కింద ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తూ, వారు చేరినప్పటి నుంచి సర్వీసును పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. జూలై నెలలో జరిగే బోర్డు మీటింగ్‌లో ఈ అంశాలన్నీ ఆమోదం పొందిన తర్వాత సర్కుల్యర్ విడుదల చేస్తామని, ఆ వెంటనే 2021 కొత్త పేస్కల్ వర్తింపజేస్తామన్నారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఫైల్‌పై డిప్యూటీ సీఎం సంతకం కాగానే అందరికీ పోస్టింగ్ ఇస్తామని ఈడీ అధికారులు హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, ఇతర నాయకులు, ఈడీ అధికారులు పాల్గొన్నారు.






