21 June, 2026 | 1:39 AM

భూదాన భూములను రక్షించండి... కబ్జాలకు గురి కాకుండా అరికట్టండి

21-06-2026 12:00 AM

సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్

జవహర్ నగర్, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని భూదాన భూములను కబ్జాలకు గురి కాకుండా అరికట్టండని సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ దళిత భవన్లో శనివారం దయానంద్ అధ్యక్షతన సర్వోదయ మండలి మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్, కార్యదర్శి వై. గిరి ప్రసాదులు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.79 వేల ఎకరాల భూదాన భూములు ఉన్న వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని అట్టి భూదాన భూములను నిజమైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

భూదాన భూములను కబ్జా కోర్ల చెర నుండి కాపాడి కబ్జాదారుల భరతం  పట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తేటతెల్లమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా గాంధీభవన్లో భూదాన్ బోర్డు పెట్టుకొని భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగదన్నారు. ఈ భూముల గురించి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన అధికారులు ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డ్ ను ఖాళీ చేయించడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తప్పుబట్టారు. ఇకనైనా ప్రభుత్వం కబ్జాకోరుల భరతం పట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఇఫ్టు కార్యదర్శి షేక్షావలి, రమేష్, మల్లేష్, సుజాత, అనంతలక్ష్మి, జిల్లాలోని వివిధ మండలాల సర్వోదయ మండల సభ్యులు పాల్గొన్నారు.