10 April, 2026 | 10:57 PM

రోడ్డు ప్రమాదాలపై మండల అధికారుల సమావేశం

10-04-2026 09:23 PM

దమ్మపేట,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల భద్రతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులు చర్చించారు. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్లు, రాళ్లు, ఇతర అడ్డంకులను తొలగించడంతో పాటు గ్రామాల్లో రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేయాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో గ్రామస్థాయి రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలపై వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాం నరేష్, ఎంపీడీవో బి. రవీంద్ర రెడ్డి, ఎంఈఓ జగపతయ్య, ఏఈ (పీఆర్) జుంకీలాల్, సిఐ పి నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.