3 June, 2026 | 1:01 AM

పైసా పెట్టు.. రేషన్‌కార్డు పట్టు

03-06-2026 12:08 AM
  1. కోట్ల ఆస్తి ఉన్నా నిరుపేదే.. రేషన్ బియ్యానికి కక్కుర్తి 
  2. అదే దారిలో అందినకాడికి దండుకుండున్న మండల అధికారులు 
  3. డబ్బులు పెడితే చాలు కోటీశ్వరుడైనా నిరుపేదే
  4. కార్డు ఉంటే కోటా బియ్యం ఒకెత్తు.. ఉచిత వైద్యం మరో ఎత్తు
  5. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు.. కొరబడిన అధికారుల పర్యవేక్షణ

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2, (విజయక్రాంతి): మండలంలో పైసా పెట్టు నీ పని అయిపోయినట్టు అని మండల అధికారుల తీరు సాగుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఉంటే ఎంతటి ధనవంతుడికైనా వారి పని చేసి పెడ్తున్నారని, మా దగ్గర ఇచ్చుకోడానికి పైసలు లేక అర్హులమైనా లబ్దిపొందక తీవ్రంగా నష్టపోతున్నామని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండలంలో పేరుకే నిరుపేదలైన (కోట్లల్లో ఉన్న ధనవంతులు) రేషన్ కార్డు, వయో వృద్ధులకు చెందాల్సిన లబ్దిని పొందుతూ విర్రవీగుతూ, వికటాట్టహాసం చేస్తూ నీకు రేషన్ కార్డు లేదా అయ్యో, మరోలా నీకు పింఛన్ రావట్లేదా నాకు వస్తుంది .

అని వారి వద్దకి వచ్చిన వారికి పైస పెట్టు రేషన్ కార్డు పట్టు అని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కో్టీశ్వరులు(అనర్హులు) అయినా కోటా బియ్యం కోసం అసలైన(అర్హత కల్గిన లబ్ధిదారులు) సామాన్య జనం లాగా వారు క్యూ లైన్ లో నిలబడరు, వారు ఎప్పుడొస్తే అప్పుడే నిరీక్షణ లేకుండా వెంటనే వారి కోటా బియ్యం అప్పగించి పంపించేస్తారని, వారికి ఇచ్చే గౌరవం మాకు లేదని, గత ప్రభుత్వ హయాంలో ధనవంతులని వారి రేషన్ కార్డులని తొలగిస్తే మళ్ళీ తమ చేతివాటం చూపించి కార్డులను పొందారని నిజమైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత పౌర సరఫరాల శాఖ పట్టించుకోకపోవడం కడు శోచనీయం.

రేషన్ కార్డులు ఒకెత్తు... పింఛన్లు మరో ఎత్తు

నేటికీ మండలంలో మరణించిన వారి పేరును రేషన్ కార్డులో తొలగించకపోవడంతో బియ్యం కోటాను తీసుకోవడంతో పాటు పింఛన్లను కూడా తీసుకుంటుండడంతో అర్హులైన, నిరు పేదరికం అనుభవిస్తున్న వారు తీవ్రంగా నష్టపోతూ ఇంకా కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పైసలు పెట్టిన వారికి అన్నీ వస్తున్నాయి మా దగ్గర అవి లెవనే కదా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని మండల అధికారులను వారేమి చేయలేక చిన్నబుచ్చుకుంటున్నారు.

ఇకనైనా జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల అధికారులు నిరుపేదలను గుర్తించి(అర్హత కల్గిన వారిని) తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయపడుతున్నారు. గుండాల మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయనీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం మారుమూల గుండాల మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో నెలకొని ఉంది. పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అనర్హులైన ధనవంతులకు ఉన్న రేషన్ కార్డులను తొలగించి, నిరుపేదలైన అర్హులకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.