3 June, 2026 | 1:56 AM

రాష్ట్రంలో ట్రిపుల్ సీ పాలన!

03-06-2026 01:22 AM
  1. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్
  2. బీజేపీకి అధికారమిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తాం
  3. సీఎం గారూ.. మీకు చేతగాదని ఒప్పుకోండి
  4. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తాం
  5. కేంద్రమంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ట్రిపుల్ సీ సినిమా నడుస్తోందని.. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్రం నిధులు అవసరమని, బీజేపీకి రాష్ట్రంలో అధికారమిస్తే కేంద్రం నుంచి నిధులుతెస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడి హట్టిపై చర్చలు జరిపేందుకు  మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయిట్‌మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన సృష్టిస్తామని రేవంత్‌రెడ్డి పెద్దమాటలు చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం విషయంలో గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిం దనే విషయాన్ని మర్చిపోయారా? అని ఆయన సీఎంను ప్రశ్నించారు. ‘సీఎం గారు.. మీకు అపాయిట్‌మెంట్ తీసుకోవడం చేతగాకపోతే.. ఆ విషయాన్ని ఒప్పుకోండి.

అప్పు డు నేను, కిషన్‌రెడ్డి ముందుకొస్తాం. అపాయిట్‌మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం’ అన్నా రు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధా లు పెట్టుకుంటూ ముందుకుపోవాలే తప్ప గిల్లికజ్జాలు పెట్టుకుంటూ రాజకీయ లబ్ధిపొందా లనుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాల ను మాత్రం చేరుకోలేకపోయామని బండి సంజయ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో, ఇప్పు డు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో కళ్ల ముందు కన్పిస్తోందన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడిందని, లక్షల కోట్ల రూపాయలు సాధించుకు న్నారని విమర్శించారు. తెలంగాణ ఇస్తారా? మేమే బిల్లు పెట్టి ఇవ్వాలా? అని సుష్మాస్వరాజ్ నిలదీస్తే తప్ప కాంగ్రెస్ ఆనాడు తెలంగాణను ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కనీ సం సభకు కూడా రాలేదని చెప్పారు.

ఓటేసిన పాపానికి కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ప్రధానిని కలుస్తారు.. కేంద్ర మంత్రు లను కలుస్తారు.. బయటకొచ్చి ప్రధాని, కేంద్ర మంత్రులను దూషిస్తారని, ఇట్లయితే నిధులు ఎట్లా వస్తాయన్నారు.

సరైనా ప్రణాళికలేదు..

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా కేంద్రం వడ్లను కొంటోందన్నారు. కేంద్రం వడ్లను కొనకపోతే ఎందుకు కొనడం లేదని ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయ డం లేదో చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గౌతంరావు, అశోక్, పెద్దిరెడ్డి, రాములు పాల్గొన్నారు.