ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్ హెచ్ ఓ లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తితే డీసిఆర్బీ అధికారులకు తెలియజేసి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కేసు నమోదయినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతీ విషయాన్ని ఆన్లైన్లో పొందుపరిచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు.
ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటి సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు. 5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కేసులకు సంభందించిన ఫైళ్ళను క్రమపద్దతిలో అమర్చుకోవాలని సూచించారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలియజేసారు.




