30 June, 2026 | 3:47 PM

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

30-06-2026 03:13 PM

* నీతి, నిజాయితీ, సమయపాలనతో విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలి..

* జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, పరిపాలనా నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి, గుడుంబా, దేశీదారు తయారీ, రవాణా, విక్రయాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గంజాయి నిర్మూలనకు సమాచారం అందించే పోలీసు సిబ్బందిని ప్రోత్సహించేందుకు నగదు రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలు, ఈ-పెట్టీ కేసులు వంటి అంశాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, నాణ్యమైన దర్యాప్తుతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని తెలిపారు.

ముఖ్యంగా పోలీస్ శాఖ అమలు చేస్తున్న వర్టికల్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. బ్లూ కోర్ట్, రిసెప్షన్, సీడీఎఫ్, చార్జ్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్, 5S విధానాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని, సమాజంలో పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా సేవలందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, నార్నూర్ సీఐ బి. అంజమ్మ, ఎస్ఐ శ్రీ సాయి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.