30 June, 2026 | 3:52 PM

పీఆర్‌పీ పే అప్‌గ్రేడేషన్ సమస్య పరిష్కరించాలి

30-06-2026 02:58 PM

అధికారుల పోరాటానికి ఎఐటియుసి మద్దతు

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): సింగరేణి అధికారుల పీఆర్‌పీ పే అప్‌గ్రేడేషన్ సమస్యను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య డిమాండ్ చేశారు. అధికారుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా కె. సారయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న సింగరేణి అధికారుల సమస్యలను పరిష్కరించకుండా వారి సహనాన్ని పరీక్షించడం వల్లే వారు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. మణుగూరులో నిరాహార దీక్ష చేస్తున్న అధికారుల శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ఇల్లందు బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, జిల్లా సమితి సభ్యుడు గుగులోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.