11 March, 2026 | 2:00 AM

మహిళా పోలీసుల సంక్షేమమే ధ్యేయం

09-03-2026 12:33 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

106 మంది మహిళా సిబ్బందికి అత్యాధునిక వైద్య పరీక్షలు 

ఉచిత మందుల పంపిణీ

కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి 

కామారెడ్డి, మార్చి 8 (విజయక్రాంతి): మహిళలు అబలలు కాదు,సకల శక్తులు కలిగిన సబలలు అని కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి అన్నారు. జాతీయ మహిళా సంక్షేమ దినం సందర్భంగా మహిళా పోలీసులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్పి చైతన్య రెడ్డి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, ప్రత్యేక సంకల్పంతో మహిళా పోలీసులకు ’మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాల యంలోని మహిళా అధికారులు, మహిళా సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర  ప్రత్యేక సంకల్పంతో ఆదివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణలో భారీ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  మహిళా శక్తిని గౌరవిస్తూ, విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే వారికి నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి, శ్రీ మెడికేర్ ఆసుపత్రి నిపుణులైన వైద్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ మెగా హెల్త్ క్యాంప్లో సుమారు 106 మంది మహిళా సిబ్బందికి అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఏఎస్పీ కె. నరసింహ రెడ్డి మాట్లాడుతూ, మహిళా పోలీసు సిబ్బందికి ఉండే అదనపు బాధ్యతలను గుర్తుచేశారు.  ఒకవైపు కఠినమైన పోలీసు విధులు నిర్వహిస్తూనే, మరోవైపు కుటుంబ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మీలోని ఈ బహుముఖ ప్రజ్ఞ సమాజానికి ఆదర్శం అని అన్నారు. అయితే, అందరి సంక్షేమం కోసం పాటుపడే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అని అన్నారు. 

విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమిస్తూనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తనకు ఏ కష్టం వచ్చినా ఒకరి పై అధికారిలా మాత్రమే కాకుండా, ఒక తోడబుట్టిన అక్కలా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏఎస్పీ చైతన్య రెడ్డి ఇచ్చిన భరోసా మహిళా పోలీసులలో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహిళా శక్తికి ఆకాశమే హద్దు అని ఆమె పిలుపునిచ్చారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో నిపుణులైన కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, నేత్ర వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించారు. బి.పి, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ , 2 డి ఎకో, బి.ఎం.డి డిజిటల్ ఎక్సరే వంటి కీలక పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సహకరించిన ఆర్ ఎం ఓ డా. సంతోష్ , కార్డీ యాలాజిస్ట్ డా. దినకర్ , డా. సురేఖ, డా. విజ్ఞ, డా. శుభ, డా. అంచల్, నేత్ర వైద్య సహాయకులు హరికృష్ణలను జిల్లా కామారెడ్డి అదనపు ఎస్పి నరసింహ రెడ్డి, ఏఎస్పీ బి చైతన్య రెడ్డి  ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి , ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కామారెడ్డి ఎస్ హెచ్ ఓ నరహరి, జిల్లాలోని మహిళా అధికారులు, మహిళా సిబ్బంది, ఆర్.ఎస్.ఐ లు, డి.పి.ఓ మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.