మేఘారెడ్డి X చిన్నారెడ్డి
వనపర్తి ‘కాంగ్రెస్’లో కుంపటి
పార్టీ నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు
పార్టీలో బీఆర్‌ఎస్ నాయకుల చేరికపై చిన్నారెడ్డి వర్గం అభ్యంతరం
చేర్చుకోవద్దంటూ ఎమ్మెల్యే ఇంటి ఎదుట కాంగ్రెస్ మండల అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం
వనపర్తి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ‘వనపర్తి’ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. అవి రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ అభాసుపాలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విష యమై రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయమై గత నెల 2న ఎమ్మెల్యే మేఘారెడ్డికి తెలియకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకులను కాంగ్రెస్‌లోకి ఎలా చేర్చుకుంటారంటూ ఆయన వర్గీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై మండిపడ్డారు. మర్నాడు చిన్నారెడ్డి వర్గీయులు విలేకర్ల సమావేశం పెట్టి ఎమ్మెల్యేపై పలు అంశాలపై విమర్శించారు.
ఇవి చల్లారక ముందే తాజాగా గురువారం మరో ఘటన చోటుచేసుకున్నది. గోపాల్‌పేట మండలానికి చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రె స్ పార్టీలో చేర్చుకునే విషయమై ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారెడ్డి వర్గీయుడు, కాంగ్రెస్ పార్టీ గోపాల్‌పేట మండల అధ్యక్షుడు గుండ్రాతి గణేష్ గౌడ్ తన అనుచరులతో కలిసి సరాసరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఆందోళన చేపట్టారు. ఒకదశలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని అం టించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి, మరోనేత చిన్నారెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇది ఇలా ఉంటే చిన్నారెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే మేఘారెడ్డిపై దాడి చేసేందుకే ఆయన ఇంటికి వెళ్లారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్న ఘటనపై వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి పీఏ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.






