54 కోట్ల మెఫెడ్రోన్ పట్టివేత
- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
- యాదాద్రి జిల్లా కొండమడుగు వేటుకూరి ల్యాబ్‌లో తయారీ
- నాగ్‌పూర్‌కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
నల్లగొండ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): 27 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బీబీనగర్, ఎస్‌ఓటీ పోలీసు లు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 8న బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమం లో కారును తనిఖీ చేయగా అందులో 27 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్ తయారీలో ఉపయోగించే సుమారు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ లభ్యమైంది.
వెంటనే వాటిని స్వాధీనం చేసుకునీ అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తెలిపిన సమాచారంతో మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్ (49), అస్సాంకు చెందిన ము జామల్ హక్ (25), నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే (31), హైదరాబాద్ చందానగర్‌కు చెందిన ఉపద్రష్ట రమణ మూర్తి (65) అనే నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో చేతన్ డ్రగ్ తయారీకి ఆర్గనైజర్‌గా, ఆర్థి క సహకారం అందించిన వ్యక్తి గా, ముజామల్ తయారీలో సహకరించిన వ్యక్తిగా, ఆకాశ్ అక్రమ రవాణాలో సహకరించిన వ్యక్తిగా, రమణ మూర్తి వేటుకూరి ల్యాబ్స్ ఇన్చార్జిగా వ్యవహరించారు.
ఈ వ్యవహారంలో భాగస్వాములైన మరో నలుగురు నిందితులు ఎం.డి. అయూబ్ అలీ, చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, యేటుకూరి రామరాజు పరారీలో ఉన్నట్లు పోలీ సులు వెల్లడించారు. కొండమడుగు గ్రామంలోని వేటుకూరి ల్యాబ్‌లో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు మెఫెడ్రోన్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు. తయారు చేసిన డ్రగ్‌ను నాగ్‌పూర్‌కు తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు ల్యాబ్లో తనిఖీలు నిర్వహించి రియాక్టర్, సెంట్రిఫ్యూజ్తో పాటు డ్రగ్ తయారీకి ఉపయోగించిన ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఆరు సెల్ఫోన్లు, కారు, డ్రగ్ తయారీ పరికరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.54 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం ల్యాబ్‌ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.






