27 February, 2026 | 3:53 AM

మెట్రో టేకోవర్ మాయాజాలం!

27-02-2026 12:00 AM
  1. ఖజానాకు 12 వేల కోట్ల గండి!

ప్రజా ధనంతో ప్రైవేటు సంస్థకు ‘సేఫ్ ఎగ్జిట్’

అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి రూ.1,200 కోట్లు ఆదా

‘డిఫాల్ట్’ కింద చర్యలు తీసుకోకుండా l అండ్ టీకి ప్రభుత్వ వత్తాసు?

వాటాల కొనుగోలు పేరుతో నిబంధనలకు పాతర!

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నష్టాల బాటలో ఉన్నదని, రవాణా వ్యాపారం నుంచి తప్పుకుంటామని చెపుతున్న ఎల్ అండ్ టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోంది. లాభాలు వస్తే జేబులో వేసుకుని, నష్టాలు వస్తే చేతులెత్తేస్తున్న ప్రైవేటు సంస్థ వైఫల్యాన్ని ప్రశ్నించాల్సిన సర్కార్..

అందుకు విరుద్ధంగా ప్రజా ధనంతో ఆ సంస్థకు అత్యం త సురక్షితమైన ‘సేఫ్ ఎగ్జిట్’ కల్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరా బాద్ మెట్రో కన్సెషన్ అగ్రిమెంట్‌లోని కఠిన నిబంధనలను ప్రయోగిస్తే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.1,200 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ దారిని పక్కనపెట్టి ఏకంగా రూ.12,000 కోట్ల అప్పుల భారాన్ని నెత్తిన వేసుకునేందుకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది.

అగ్రిమెంట్ నిబంధనలు ఏం చెపుతున్నాయి? 

ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మధ్యలో ప్రాజెక్టును వదిలేయడం స్పష్టమైన ఉల్లంఘన. ఆర్టికల్ 37.1.1 (డీ) ప్రకారం ప్రభుత్వ ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ప్రాజెక్ట్ నిర్వ హణను వదిలేసినా లేదా వదిలేయాలని ఉద్దే శం వ్యక్తపరిచినా అది నేరుగా ’ఎల్ అండ్ టీ వైఫల్యం’ కింద పరిగణించబడుతుంది. ఆర్టికల్ 37.3.1 ప్రకారం ఒకవేళ ’కన్సెషనైర్ డిఫాల్ట్’ వల్ల ప్రాజెక్ట్ రద్దయితే, ఎల్ అండ్ టీ కి ఉన్న మొత్తం అప్పులో ప్రభుత్వం కేవలం 90 శాతం మాత్రమే (ఇన్సూరెన్స్ కవర్ పోనూ) చెల్లించాలి.

అలాగే ఎల్ అండ్ టీ పెట్టిన సొంత పెట్టుబడికి సంబంధించి ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 39.2.1 ప్రకారం ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత కూడా 120 రోజుల పాటు ఆస్తుల్లో ఏవైనా లోపాలు ఉంటే, వాటికి బాధ్యత వహి స్తూ.. ముందస్తు ఏడాది ఆదాయంలో 5% మొత్తాన్ని ప్రభుత్వం ఎస్క్రో ఖాతాలో రిటెన్షన్ మనీగా అట్టిపెట్టుకుంటుంది.

ప్రభుత్వానికి రావాల్సిన లాభం ఏది?

ఆర్టికల్ 48.1 ప్రకారం ఈ ప్రాజెక్ట్ గరిష్ట వ్యయం రూ.12,132 కోట్లుగా అంచనా వేయబడింది. ఆర్టికల్ 25.1.1 ప్రకారం ఈ ప్రాజె క్టులో ప్రభుత్వం రూ.1,458 కోట్లను గ్రాంట్ రూపంలో ఎల్ అండ్ టీ కి చెల్లించడానికి అంగీకరించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు సుమారు రూ.12 వేల కోట్ల కు చేరుకుంది.

నిబంధనల ప్రకారం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ‘డిఫాల్ట్‘ నోటీసు ఇస్తే.. ఈ రూ.12 వేల కోట్ల బ్యాంకు అప్పులో ప్రభుత్వం కేవలం 90 శాతం (రూ.10,800 కోట్లు) మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 10 శాతం (రూ.1,200 కోట్లు) అప్పు భా రాన్ని ఎల్ అండ్ టీ సంస్థే అపరాధ రుసుము గా భరించాలి. పైగా, ఎల్ అండ్ టీ పెట్టిన సొంత ఈక్విటీ (వాటా)ని పూర్తిగా కోల్పోతుంది.

ప్రైవేటుకు దొడ్డిదారిన లాభం

రూ.1,200 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసే చట్టపరమైన హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రభుత్వం ‘వాటాల కొనుగోలు’ అనే కొత్త దారిని ఎంచు కుంది. తాజా సమాచారం ప్రకారం, ఉల్లంఘన కింద అగ్రిమెంట్ రద్దు చేయడానికి బ దులుగా.. ఎల్ అండ్ టీ కి ఉన్న మొత్తం ఈక్వి టీ (వాటాల)ని కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రాజెక్టును టేకోవర్ చేస్తోంది. ఇలా వాటాలతో సహా కొనుగోలు చేయడం వల్ల, ఆ ప్రాజెక్టుపై ఉన్న మొత్తం 100 శాతం అప్పుల (రూ.12 వేల కోట్లు) బాధ్యతను ఐఆర్‌ఎఫ్సీ లాంటి సంస్థల ద్వారా ప్రభుత్వమే స్వీకరిస్తోంది.

అంతిమంగా నష్టపోయేది ప్రజలే

చట్ట ప్రకారం మిగలాల్సిన రూ.1,200 కోట్లను ప్రభుత్వం ఎందుకు వదులుకుంటోందనేది ప్రశ్నగా మారింది. డిఫాల్ట్ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేని ఈక్విటీని, ప్రజా ధనం వెచ్చించి ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తోంది? భవిష్యత్తులో నిర్మించబోయే ఫేజ్-2 విస్తరణకు ఆటంకాలు కలగకూ డదని, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు, న్యాయపరమైన వివాదాలు రాకుండా ఉండాలనే సాకుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నప్పటికీ..

అంతిమంగా నష్టపోయేది ప్రజలే. వ్యాపారంలో ఎదురైన వైఫల్యాన్ని సొంతంగా భరించాల్సిన ఎల్ అండ్ టీ సంస్థ.. ఎలాంటి పెనాల్టీలు లేకుండా అత్యంత లాభదాయకంగా ప్రాజెక్టు నుంచి బయటపడుతుం డటం, ఆ మొత్తం 12 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపడం విమర్శలకు తావిస్తోంది.