12-12-2025 01:51:35 AM
ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికేనా..?
3.76 బిలియన్ల ఆదాయమే లక్ష్యం
భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయాలాండ్, ఇండోనేషియాపై ప్రభావం
మెక్సికోసిటీ, డిసెంబర్ 11: ఇప్పుడు మెక్సికో భారతదేశంపై 50% సుంకాలను విధిస్తోంది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాల పెంపుతో, భారతీయ దిగుమతులపై 50% వరకు సుంకాలు విధించబడతాయి. యుఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం యొక్క తదుపరి సమీక్షకు ముందు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ దిగుమతులపై అమెరికా విధించిన అధిక 50% సుంకాల తర్వాత, తీవ్రమవుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధం మధ్య భారత్‌పై భారీ సంకాలను మెక్సికో వేస్తోంది.
బుధవారం, మెక్సికో సెనేట్ భారతదేశం, చైనా తదితర అనేక ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులపై 50% వరకు సుంకాలను ఆమోదించిందని ఓ అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇదంతా ట్రంప్‌ను సంతోషపెట్ట డానికేనని అనిపిస్తోందని పేర్కొంది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ సుంకాల పెంపుతో, మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుండి వచ్చే ఆటోలు, ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ప్లాస్టిక్స్, ఉక్కు వంటి వస్తువులపై 50% వరకు సుంకాలు విధించబడతాయి.
దీంతో భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయ్లాండ్, ఇండోనే షియా వంటి దేశాలు ప్రభావితమవుతాయి. ఈ సంకాల ద్వారా వచ్చే ఏడాది అదనంగా 3.76 బిలియన్ల డాలర్ల (సుమారు రూ.33,910 కోట్లు) ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యుఎస్- మెక్సికో -కెనడా వాణిజ్య ఒప్పందం (యూఎస్‌ఎంసీఏ)పై వాషింగ్టన్ సమీక్షకు ముందు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ చర్య అని విశ్లేషకులు తెలిపారు. అయితే, కొన్ని నెలలుగా షైన్బామ్ ప్రభుత్వంపై ట్రంప్ ఆందోళనలను లేవనెత్తుతూనే ఉన్నారు. నిరంతరం విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.