మిలిటెంట్ల ఘాతుకం
మణిపూర్‌లో పేలిన ఐఈడీ
ఇద్దరు జవాన్లు మృతి
ఇంఫాల్, జూలై ౬: మణిపూర్‌లో గుర్తుతెలియని మిలింటెంట్ గ్రూప్ ఘాతుకానికి పాల్పడింది. ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్‌షాంగ్ కాంగ్‌లో సోమవారం రాత్రి ఐఈడీ పేలి అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పలువురు జవాన్లు గాయాల పాలయ్యారు. మృతులను వారెంట్ ఆఫీసర్ బల్వంత్ సింగ్, రైఫిల్‌మెన్ సీయామ్ సింగ్‌గా అక్కడి అధికారులు గుర్తించారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మిలిటెంట్ గ్రూప్ ఒక వంతెన వద్ద ఐఈడీ అమర్చిందని, భద్రతా దళాల వాహనాలు వంతెన గుండా వెళ్తున్న క్రమంలో ఐఈడీ పేలింది.
ఘటన తర్వాత ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు గంటపాటు భీకర పోరు కొనసాగింది. ఈ క్రమంలో భద్రతా దళాలు ఇదే ప్రాంతంలో మరో ఐఈడీని నిర్వీర్యం చేశాయి. మిలిటెంట్ల ఘాతుకాన్ని వేర్వేరుగా గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, హోం మంత్రి గోవిందాస్ కొంతౌజం ఖండించారు. ఘాతుకానికి పాల్పడిన మిలిటెంట్ గ్రూప్‌ను తుదముట్టిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు.






