రిజర్వేషన్ల కోసం మిలిటెంట్ పోరాటాలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
42% రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి): బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు, హక్కుల సాధన కోసం మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ కృష్ణయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వని ఆధిపత్య కులపార్టీలు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీసీ సంఘాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవొచ్చని పేర్కొన్నారు. రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంతటి త్యాగానికైనా తాము సిద్ధమని చెప్పారు. జూన్ 15న ఇందిరాపార్క్ వద్ద బీసీ జనసభ ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాకు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో గిరిజన రిజర్వేషన్ సాదన సమితి చైర్మన్ సంజీవ్‌నాయక్, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, ప్రొఫెసర్ వెంకటేష్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్, ఎలక్ట్రానిక్ మీడియా తెలంగాణ ఫోరం అధ్యక్షుడు రమణకుమార్, టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్, బీసీ ఐక్యవేదిక చైర్మన్ కాటం నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.






