20 May, 2026 | 2:14 AM

ఎడాపెడా.. రైతన్నలకు దగా..

20-05-2026 01:00 AM

అన్నదాతను ఆగం చేస్తున్న మిల్లర్లు..

కొనుగోళ్లలో కొర్రీలు..తూకంలో మోసాలు..

సార్లూ రారు.. పర్యవేక్షణ చేయరూ..

ఎమ్మెల్యే పోచారం.. ఆదేశించని కానరాని ఫలితం..

మిల్లర్ల తీరుతో.. 

ఆందోళనలో రైతన్నలు..

నష్టపోతున్న రైతులు..

పట్టించుకోని అధికారులు..

బాన్సువాడ, మే 19 (విజయక్రాంతి): పుడమిని నమ్ముకున్న అన్నదాతకు ఎక్కడపడితే అక్కడ నష్టమే జరుగుతుంది. అటు ప్రకృతి వైపరీత్యాలు పంటను దెబ్బతీయగా, దళారుల బెడద,ఇటు రైస్ మిల్లర్ లు మరింత కర్షకులను కన్నీరు పెట్టిస్తుంది. వడగండ్ల వానలకు చేతికొచ్చిన పంట చేజారి కూడా, మిగిలిన దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆశించిన స్థాయిలో లాభ సాటి వ్యవసాయం కాకపోగా, చేతికొచ్చిన పంట అయినా మద్దతు ధర లభించే పరిస్థితి లేకుండా పోయింది.

కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందుదామనుకుంటే తీరా పలు మిల్లులలో అదనపు తరుగుతో రైతులను దోపిడి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలంలోని పలు మిల్లులో ఈ తతంగంతో రైతులు విసిగిపోయి రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా.. ఆ పాటికే సమఃస్యను పరిష్కరిస్తామని చెప్పి మళ్లీ పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయా గ్రామాల రైతులు బహిరంగంగా అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశానికి రైతే రాజు... రైతు దేశానికి వెన్నుముక.. 

రైతన్నల మాటలను అధికారులు, ప్రజాప్రతినిధులు సభలు, సమావేశాల సమ యంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. కానీ రైతులకు న్యాయం చేయడానికి మాత్రం క్షేత్ర స్థాయిలో ఆ మాటలు కానరావడం లేదు. దీంతో పలు మిల్లర్ల తీరుతో రైతులు విసిగిపోతున్నారు. తమకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరను పొందుదామనుకుంటే అధికారుల పర్యవేక్షణ లోపంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఎమ్మెల్యే పోచారం ఆదేశించిన కానరాని ఫలితం..

రైతుల సమస్యలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి రావడంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఓ సమావేశంలో ఆయా మిల్లుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులకు సైతం రైతులకు ఇబ్బందులు పెట్టే మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం ఇచ్చారు.

కానీ క్షేత్ర స్థాయిలో నామమాత్రంగా అధికారుల పర్యవేక్షణ ఉండటంతో ముఖ్యంగా బీర్కూర్, నస్రుల్లాబాద్, పోతంగల్ మండలంలోని ఆయా మిల్లులతో అదనపు తరుగుతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉమ్మడి బీర్కూర్ మండలంలో ప్రతిఏటా రైతులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నా.. ఆ ఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవడం విఫలమవుతూనే ఉన్నారు.

న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నా రైతులు..?

అదనపు తరగు విషయంలో ఆయా మిల్లుల తీరుతో బాధపడుతున్న రైతులు కొందరు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రాలకు తెచ్చి మద్దతు ధరను పొందుదామనుకుంటే ఆయా బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలంలోని ఆయా మిల్లుల తీరుపై న్యాయ పోరాటానికి రైతులు సిద్ధమవుతున్నారు. దీనికి అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రదాన కారణమని తెలుస్తుంది. ఎమ్మెల్యే ఆదేశాలను సైతం అధికారులు బేఖాతర్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదనపు తరగు విషయంలో ఏది ఏమైనా రైతులకు న్యాయం చేసేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అవసరం ఏంతైనా ఉంది.

పట్టించుకోని అధికారులు..

రైతులను ఆగం చేసి దగా చేస్తున్న మిల్లర్ల  పట్ల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ, మిల్లర్ లు ఇష్టా రీతిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ అన్నదాతలనునిండా ముంచుతున్నారు. అధికారుల పట్టింపు లేని తనం కారణంగానే ధాన్యం కొనుగోలు చేసి మూడు పువ్వుల ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఇప్పటికైనా రైతులను మోసం చేస్తున్న మిల్లర్ లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.