2 June, 2026 | 1:50 PM

త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం

02-06-2026 01:14 PM
  1. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు..
  2. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి అడ్లూరి..
  3. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి..
  4. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం..

కరీంనగర్, జూన్02(విజయక్రాంతి): అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని అన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా, ప్రజల ఆకాంక్షలే నేటి తెలంగాణ అభ్యుదయానికి పునాదిని మంత్రి అడ్లూరి అన్నారు.

 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమై నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు.

తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్-2047' దిశానిర్దేశక పత్రాన్ని ఆవిష్కరించిందని, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరిస్తూ, సంపద సృష్టించి ఆ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణ నేడు దేశానికే కాదు, ప్రపంచానికి సైతం అభివృద్ధి నమూనాగా నిలుస్తుండటం మనందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ, మన జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని ఈసందర్భంగా మంత్రి వివరించారు.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక: ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత-క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన పది అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలకు పరిష్కారం, ప్రభుత్వ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.  మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగామని మంత్రి తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 3 వేల 506 ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2  వేల 913 పెండింగ్ ఫైళ్లను అధికారులు పరిష్కరించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించాం. ఈ మేళాకు హాజరైన 78  కంపెనీలు 292 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. 

 మహాలక్ష్మి పథకం: మహిళల ఆర్థిక సాధికారతకు, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.  మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు.  తద్వారా 7 కోట్ల 39 లక్షల ఉచిత ప్రయాణాలకు గాను, వారికి 334 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. కరీంనగర్ జిల్లాలో ఒక లక్ష 58 వేల మంది లబ్ధిదారులకు 9 లక్షల 23  వేల 700 సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం 29 కోట్ల 78 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది.

 గృహజ్యోతి పథకం: ఈ పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేస్తున్నాం. మార్చి 2024 నుండి ఇప్పటివరకు ఒక లక్ష 73 వేల 627 మంది వినియోగదారులు 153 కోట్ల రూపాయల లబ్ధిని పొందారు.

రైతు భరోసాః రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.  జిల్లాలో రైతుభరోసా పథకం ద్వారా ఒక లక్ష 93 వేల 544 మంది రైతులకు గత యాసంగి సీజన్ లో 143 కోట్ల 35 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది.  

రైతు బీమా పథకం : జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 267 మంది రైతు కుంటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున రూ. 13 కోట్ల 35 లక్షల రూపాయల పరిహారాన్ని అందించి రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలబడింది.

ఇందిరమ్మ ఇండ్లు : పేద, మధ్య తరగతి ప్రజల స్వంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి, జిల్లాలో 10 వేల 114 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. 7 వేలా 76 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. 2 వేల 81 మంది లబ్ధిదారులు గృహప్రవేశం పూర్తి చేసుకుని స్వంత ఇండ్లలో నివసిస్తున్నారు.  

ధాన్యం సేకరణ: ‌ జిల్లాలో ఈ రబీ సీజన్లో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 90 వేల 885 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 5 వందల 54 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది.  అదేవిధంగా 23 వేల 710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. 

సన్న బియ్యం పంపిణీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రతినెలా 600 క్వింటాళ్ల  సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 45 వేల 920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.  96 వేల 775 మంది కుటుంబ సభ్యులను కొత్తగా రేషన్ కార్డుల్లో చేర్చాం. మొత్తంగా జిల్లాలో 3 లక్షల 20వేల 320 కుటుంబాలకు, ప్రతి నెల 6 వేల 21 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని మంత్రి తెలిపారు. 

ఇతర అభివృద్ధి ఆయన మాటల్లోనే...పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా  2025-26 ఆర్థిక సంవత్సరంలో 980 స్వయం సహాయక సంఘాల మహిళలకు 147 కోట్ల రూపాయలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 118 సంఘాలకు 17 కోట్ల 70 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశాం.   

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం జరిగింది.  ఒక లక్షా 33 వేల 293 మందికి ప్రతినెలా 31 కోట్ల 32 లక్షల చేయూత పింఛన్లను అందిస్తున్నాం. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో బాగంగా, మన జిల్లాలో ఒక లక్ష 41 వేల మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల విలువైన మొబైల్ ఫిష్ రిటైల్ యూనిట్లను మంజూరు చేయడం జరిగింది.

విద్యాశాఖ: ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో బాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యావారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  సంక్షేమ హస్టల్ లు, విద్యా సంస్థలలో కిచెన్ ఆండ్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించి విద్యార్థులలో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.  ఈ విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి లో 13 వేల 137 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12 వేల 949 మంది విద్యార్థులు ఉత్తీర్ణీలు కాగా, 98.57 ఉత్తీర్ణత శాతం విద్యార్థులు సాధించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థుల పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఈ విద్యా సంవత్సరం నుండి 58 ప్రీ ప్రైమరీ స్కూళ్లను జిల్లాలో ప్రారంభిస్తున్నాం.  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపుల ద్వారా సుమారు వెయ్యి మందికి సంగీతం, కళలు, క్రీడా రంగాల్లో శిక్షణ ఇప్పించడం జరిగింది.  

సంక్షేమగ్ వసతి గృహాలు : ఈ విద్యా సంవత్సరానికి 2 వేల 535 మంది ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాం. 2025-26 విద్యా సంవత్సరంలో 29 వేల 240 మంది బీసీ విద్యార్థులకు 74 కోట్ల 43 లక్షల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.  కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా జిల్లాలో ఒక వేయి 836 మందికి, షాదీ ముబారక్ పథకం ద్వారా 458 మంది వివాహాలకు ఒక లక్ష 116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం:  ద్వారా జిల్లాలోని 38 నెట్ వర్క్  ఆసుపత్రులలో గత రెండున్నర సంవత్సరాలలో 52 వేల 116 మందికి ఉచితంగా ఆపరేషన్లు జరిగాయి. ఇందుకుగాను 139 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.

మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ:  జిల్లాలోని 777 అంగన్ వాడి కేంద్రాల ద్వారా 7 వేల 579 మంది గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ భోజనం, 46 వేల 69 మంది పిల్లలకు బలవర్ధక ఆహారం అందిస్తున్నాం. మలిదశలో వయోవృద్ధుల మానసిక, శారీరక ఉల్లాసానికి డే కేర్ సెంటర్ ప్రారంభించాం. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం మైత్రి క్లినిక్ పని చేస్తోంది.      

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న రేవంత్ రెడ్డికి, జిల్లాను సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ అమరుల కుటుంబాలను సన్మానించడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన మంత్రి పరిశీలించారు. జిల్లాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు.