పోచారం ప్రాజెక్టులో మంత్రి బోటింగ్
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి బోటు షికారి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ ఎక్సైజ్ శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోచారం ప్రాజెక్టును సందర్శించారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ లతో కలిసి పోచారం జలాశయంలో బోటింగ్ చేశారు. హైలాండ్ వరకు బోటులో ప్రయాణించి షికారు చేశారు. సాయంత్రం వేళ కావడంతో ఆహ్లాదకర వాతావరణంలో హుషారుగా షికారుగా బోటింగ్ లో ప్రయాణించారు.
ఐలాండ్లో కాటేజీల నిర్మాణాలను చేపట్టి బోటింగ్ ఏర్పాట్లు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించారు. కామారెడ్డి జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన ప్రాంత ప్రదేశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రంతో పాటు కౌలాస్ కోట ను పర్యాటక కేంద్రంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట వద్ద 400 సంవత్సరాల నాటి నాగన్న భావి పురాతన కళా శిల్పంతో పాటు ఆనాటి చెక్కిన శిల్పాలు రాతి కట్టడాలు ఎంతో పర్యాటకులను ఆకర్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ గడికోట పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి సేద తీరే అవకాశాలు ఉంటాయన్నారు. విదేశీ పర్యాటకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంత్రికి వివరించారు.




