కాంగ్రెస్ మాటిస్తే తప్పదు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవెరుస్తాం
బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే
వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
అందోల్, మే 4: కాంగ్రెస్ మాటిస్తే తప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని తెలిపారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజవర్గంలోని పుల్కల్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ౪ నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిందని స్పష్టంచేశారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో అందోల్‌లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని దామోదర పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కే వేసినట్టని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని కోరారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శ్రేణులు పాల్గొన్నారు.




