పిండిప్రోలు అభివృద్ధికి మంత్రి గ్రీన్ సిగ్నల్
తిరుమలాయపాలెం, మే 10 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పిండిప్రోలు గ్రామ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త, ఉప సర్పంచ్ చామకూరి రాజు, పాలకవర్గ సభ్యులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
గ్రామస్తుల చిరకాల కోరికైన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణంతో పాటు ఎస్సీ రెండు కాలనీలు ఉపయోగించుకునే స్మశాన వాటికకు వెళ్లే ఫార్మేషన్ రోడ్డు, గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ అవసరాలను మంత్రికి వివరించారు.
అలాగే తిరుమలాయపాలెంపిండిప్రోలు మార్గంలో కొప్పుల అశోక్ ఇంటి పక్కన ఉన్న రోడ్డు నుంచి గ్రామంలోని గోడ్ల సావిడి వరకు నక్షా ప్రకారం ఉన్న రహదారిని కొంతమంది రాజకీయ నాయకులు తమ భూములు పోతాయనే కారణంతో దారి మళ్లించారని, ప్రజల సౌకర్యార్థం పాత రోడ్డునే పునరుద్ధరించాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరారు. గ్రామ ప్రతినిధుల విన్నపంపై మంత్రి సానుకూలంగా స్పందించి పిండిప్రోలు గ్రామానికి తక్షణమే ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంజూరు చేయడంతో పాటు స్మశాన వాటిక రోడ్డు, ఇతర సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
నక్షా రోడ్డు వ్యవహారంపై వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ సమస్యలపై స్పందించి నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన మంత్రికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పప్పులు ఉపేందర్, దొడ్డ గురవయ్య, పసలాది ముత్తయ్య, గ్రామస్తులు దూదిమెట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






