calender_icon.png 19 January, 2026 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రమణీయం.. రథోత్సవం

19-01-2026 12:14:48 AM

సింగపట్నంలో కిక్కిరిసిన భక్తజనం.

సింగోటం జాతరలో మంత్రి జూపల్లి

కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 18: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సింగపట్నం ( సింగోటం ) జాతర భక్త జనంతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తుల కన్నుల పండుగగా సాగింది. స్వామివారి తేరు లాగేందుకు వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచిరథోత్సవాన్ని తిలకించేందుకు తరలి రావడంతో ప్రధాన రహదారులు భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రానంతగా జనసంద్రం కనిపించింది. స్వామివారి దర్శనంతో పాటు తేరు ఊరేగింపును చూసేందుకు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పెద్దకొత్తపల్లి ఎస్త్స్ర సతీష్, కోడేరు ఎస్త్స్ర వేణుగోపాల్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించారు.

పోలీసుల అప్రమత్తతతో రథోత్సవం ప్రశాంతంగా ముగిసింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి ఆలయానికి ఎదురుగా కొలువుదీరిన లక్ష్మీ దేవమ్మ గుట్ట వరకు దాదాపు ఒక కిలోమీటర్ మేర రథోత్సవాన్ని వైభవంగా ఊరేగించారు. భక్తుల నినాదాలు, మంగళవాద్యాల మధ్య తేరు సాగడం విశేషంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆలయ ట్రస్ట్ ధర్మకర్త కొల్లాపూర్ సంస్థానాధీశులు ఆదిత్య లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఏ.సుధాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి తదితర రాజకీయ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.