calender_icon.png 14 January, 2026 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్మాట్ బ్యారేజీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

14-01-2026 06:13:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా ప్రజల దశాబ్దాల కల, ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలిసి బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. బ్యారేజీ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజీతో ఈ ప్రాంత రైతాంగ కల సాకారం కాబోతోంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించాలి. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లా వ్యవసాయ రంగానికి ఈ బ్యారేజీ వెన్నెముకగా నిలుస్తుందని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.