రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
ఆలేరు, జులై 24: ఆత్మకూరు మండలం నుంచి మోత్కూరు వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 2 కి.మీ మేర నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తూ రోడ్డు పరిస్థితిని గమనించి అక్కడే ఆగిన మంత్రి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వెంటనే కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి, పనులు నిలిచిపోవడానికి కారణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2-3 రోజుల్లో పనులు తిరిగి ప్రారం భించాలని, అలాగే యాదగిరిగుట్ట - తుర్కపల్లి రోడ్డు పెండింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేసి ఇతర ఏజెన్సీకి అప్పగిస్తామని హెచ్చరించారు. దీనికి కాంట్రాక్టర్ 2-3 రోజుల్లో పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.






