25 July, 2026 | 1:45 AM

గ్రామాల్లో పోలీసు- ప్రజల సత్సంబంధాలు మరింత బలోపేతం

25-07-2026 12:27 AM

16 సీసీటీవీ కెమెరాల ప్రారంభం, ఎస్పీ అఖిల్ మహాజన్

ఉట్నూర్, జూలై 24 : ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామాల్లో ప్రజలతో పోలీసు సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం ధనోరా (బి) గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉట్నూర్ ఎఎస్పీ తో పాటు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలు, యువతకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. గంజాయికి బానిసైన విద్యార్థులకు డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా 20 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రెండు రోజుల మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు జిల్లా ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఎస్‌ఐ ఈ సాయన్న, సర్పంచ్ జాదవ్ జమున నాయక్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతతో పాటు సుమారు 250 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.