అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి
సబ్‌స్టేషన్, సీసీ రోడ్లు, మహిళా సంఘాలకు రుణాలపై మంత్రి కీలక ప్రకటనలు
నల్లగొండ: మండలంలోని పెద్ద సూరారం గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా రూ.20,000 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
పెద్ద సూరారం గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, గ్రామంలో రూ.60 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పెద్ద సూరారం మహిళా సంఘాలకు ఆగస్టు 15న రూ.2.5 కోట్ల రుణాల చెక్కులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల వంటి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ, చిన్నసూరారం–పెద్ద సూరారం మధ్య రైస్ మిల్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో కూడా రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు.






