30 April, 2026 | 6:51 PM

దేవరకొండ పేద విద్యార్థులకు వరం

30-04-2026 05:45 PM

 రూ.200 కోట్లతో ఇంటర్నేషనల్ లెవల్ స్కూల్!

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కొండమల్లేపల్లి మండలం కోల్ ముంతల్ పహాడ్ గ్రామంలో సుమారు 20 ఎకరాల స్థలంలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న సమగ్ర నివాస పాఠశాల పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ పాఠశాల కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడే నివసించేలా అత్యాధునిక వసతులతో ఆటస్థలాలతో ఒక విద్యా నగరంలా రూపుదిద్దుకోనుంది.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికాహారం అందించేందుకు భోజన ఖర్చులను 40 శాతం పెంచామని పాఠశాల నిర్వహణ నిధులను కూడా భారీగా పెంచామని తెలిపారు. పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రతి 15 రోజులకు ఒకసారి నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ విద్యతో పాటు నియోజకవర్గ ఆరోగ్య అవసరాల కోసం దేవరకొండ ఆసుపత్రిని 200 పడకలకు పెంచాలని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించామని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ విద్యా ప్రాజెక్టు దేవరకొండ ప్రాంత భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు