కలిసి పనిచేస్తేనే అభివృద్ధి
తాగునీటి సమస్య రావద్దు
పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి
ప్రజా పాలన ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, మార్చి 12 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా పరిషత్ లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభి మాట్లాడారు.
నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలను పొందుతారన్నారు. మున్సిపల్ పట్టణాలలో ప్రజలు అనేక సమస్యలతో ఉంటారని, వారి సమస్యలను తెలుసుకొని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహకారం మున్సిపాలిటీల అభివృద్ధికి ఉంటుందని వెల్లడించారు. విద్యతోనే మార్పు వస్తుందని ప్రతి ఒక్కరు చదువుకునేలా చూడాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పారిశుధ్యంపై దృష్టి సారించాలని, బడ్జెట్ సమావేశాలు నిర్వహించి మున్సిపాలిటీలను సవ్యంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించాలన్నారు.
అలాగే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి సారించాల న్నారు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు. వన్నుల వసూలు పై కూడా దృష్టి పెట్టాలన్నారు. అభివృద్ధితో పాటు, రోడ్డు భద్రత ,యువత మత్తుపదార్థాల బారిన పడకుండా దృష్టి సాధించాలని తెలిపారు.
10,400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలవడం జరిగిందని, 320 కోట్ల రూపాయలతో నల్లగొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారి విస్తరణకు టెండర్లు పిలిచామని, మాల్- హైదరాబాద్ లైన్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం సంతోషమని, నూతన ప్రజాప్రతి నిధులు ప్రజల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాస నసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.




