15-01-2026 12:30:38 AM
హన్మకొండ,జనవరి 14(విజయ క్రాంతి): భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండ సురేఖకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు.బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు తో కలిసి పరిశీలించారు.భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.