13-11-2025 03:08:14 PM
త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ : మంత్రి పొన్నం
హైదరాబాద్: ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం సూచించారు. కొత్త కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యయనం చేయాలని తెలిపారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ రెండేళ్లకు తగ్గించాలని ఆదేశించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆరంఘర్ బస్ టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చించాలని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో కొత్త డిపోలకు స్థల పరిశీలన చేసి కలెక్టర్ తో నివేదిక ఇవ్వాలన్నారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిట్టం అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.