13-11-2025 02:44:36 PM
ఖానాపూర్ (విజయ క్రాంతి): గంజాయి అమ్మిన, కొన్న కఠిన చర్యలు తప్పవని గంజాయి, మత్తు పదార్థాల సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఖానాపూర్ సిఐ అజయ్ తెలిపారు. గురువారం ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .ఈ మేరకు బుధవారం అందిన సమాచారం మేరకు ఖానాపూర్ మున్సిపాలిటీలోని సుభాష్ నగర్, గాంధీనగర్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బుట్ట మనోహర్, బోదాసు రాము, అనే యువకులు కోట్నాక రాము అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి కాలనీ పక్కన ఉన్న సదర్ మాట్ కాలువ వద్ద ఇతర యువకులకు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు, ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ తన సిబ్బందితో దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడ్డవారు దాని నుంచి విడుదల పొందలేరని, వారితో పాటు మరింత మంది యువకులను పాడు చేసే ప్రమాదం ఉంటుందని, ఎవరైనా తమ పిల్లలు ఇలాంటి అలవాట్లకు బానిసయితే తల్లిదండ్రులు తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచి పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారిని రిహాబిలిటేషన్ కేంద్రాలకు పంపించి మార్చవచ్చునని దీనికోసం ప్రజలు, తల్లిదండ్రులు ,పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. యువతపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. అయితే అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు రాహుల్ గైక్వాడ్ ,జ్యోతి, సిబ్బంది ఉన్నారు.